కనకాభిషేకము
కాంచీపురము ఒక మహాక్షేత్రము. పరమేశ్వరుడు ఆమ్రతరు మూలములో ఏకామ్రనాథు డన్న పేరిట కూర్చుని వున్నాడు. ఒకే ఒక్క పండును పండించటంవల్ల దీనినిఏకామ్రమనీ దానిక్రింద ప్రతిష్ఠితుడైన స్వామిని ఏకామ్రేశ్వరు డనీ పిలుస్తున్నారు. ఆయన హృదయము రసాలఫల సదృశ మాధుర్యంతో కూడినది. ఆ చెట్టు పండించే ఏక ఫలమేమి? అదే జ్ఞానం. కాంచీ నగరంలో పెద్దకంచి లేక శివకంచి చిన్నకంచి లేక విష్ణుకంచి అని రెండు భాగాలున్నవి. ఒకే మూర్తిని హరిహరుడనీ శంకర నారాయణుడనీ వ్యవహరించే విధంగా ఉత్తమోత్తమమైన ఈ క్షేత్రంలో అర్థభాగాన్ని విష్ఱుకంచి అనీ, తక్కిన అర్థభాగాన్ని శివకంచి అనీ పిలుస్తున్నారు. విష్ణువు ప్రపంచాన్నంతా పాలిస్తూ అందరినీ పోషిస్తున్న ప్రభువు. రాజాధిరాజు. ఈ క్షేత్రంలో ఆయనకు వరద రాజని పేరు. అనగా వరాలను ఇచ్చేవా డని అర్థం. ఏ యోగ్యతాలేని మనకు ఈకృపాసింధువు దీనబంధువువరదానం కోసం వరదరాజుగ ఆలయంలో ఆవిర్భవించి ఉన్నాడు.
మొత్తానికి కంచిలో 108 శివలింగాలు, 18 విష్ణు- ఆలయాలు ఉన్నవి.
ఇన్ని గుళ్ళల్లోనూ బ్రహ్మోత్సవం చేస్తుంటారు. ఈ ఉత్సవాలలో ఆలయం నుంచి ఉత్సవమూర్తులను బయటకు తీసుకొని వస్తుంటారు. విష్ణుసంబంధమైన మూర్తులు, శివ సంబంధమైన మూర్తులు రెండూరాజవీధులలో ప్రదక్షణంగా వస్తుంటే మనము వెళ్ళి నమస్కరిస్తుంటాము. ఈ రెండు మూర్తులూ శివ విష్ణు భేదం లేక మరొక్క మూర్తికి ప్రదక్షణం చేయటం ఇక్కడ అలవాటు. ఆ మూర్తియే కామకోటి పీఠాధీశ్వరి. రాజరాజేశ్వరి కంచి కామాక్షి ఈ క్షేత్రానికి నాలుగు దిక్కులలో నాలుగుగోపురములున్నవి. ఈ నగరమే ఒక పెద్ద ఆలయంగాను మధ్యలో- కాంచీ ప్రదేశంలో- కామాక్షి ముఖ్యదేవతగానూ అమరి యున్నది.
మన దేశంలో ఎన్నో శక్తిక్షేత్రాలున్నవి. వానిలో చాల చోట్లలో శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసి యున్నారు. సాధారణంగా చూపు కందని విధంగా మూలస్థానమూర్తి అధో భాగంలో శ్రీ చక్రాన్ని నిక్షిప్తంచేసి వుంటారు. కొన్ని చోట్లలో బహిరంగముగా యంత్రస్థాపనలూ కద్దు. కాని కామకోట్యములోని శ్రీచక్రము మాత్రము చాల ప్రసిద్ధిగా, అమ్మవారి సన్నిధిలోనే స్థాపింపబడి యున్నది. అర్చనలన్నీ యంత్రరాజమైన శ్రీ చక్రమునకే. మథురలో మీనాక్షి జంబు కేశస్వరములో అఖిలాండేశ్వరి, కన్యాకుమారిలో కన్యకా పరమేశ్వరి పరమసాన్నిధ్యముగా ఉండుట వాస్తవమే. కాని శ్రీ విద్యాధిదేవతగ, లలితా త్రిపురసుందరి, రాజరాజేశ్వరి అన్న సురుచిరాభిధానములతో, చంద్రకలావతంసయైపాశాం. కుశ ధనుర్బాణ పాణియై ఉన్న జగన్మాత కామాక్షియే. తన చుట్టూ నాలుగు గోపురము లుండగా ఈశ్వరుని సన్నిధిలో ఏదో ఒక మూలగాక మధ్యస్థయై కాంచీనరగపు కాంచీ భాగంలో (కాంచి అనగా కటిప్రదేశము)- దేహంలో మధ్య భాగము-అనుగ్రహమూర్తియై విల్లసిల్లేది కంచికామాక్షియే.
కామాక్షీదేవి మనకు ప్రసాదించే విశేషానుగ్రహ మేమి? అంటే ఆమె మనకు మేధను ఇస్తుంది. మేధ అనగా బుద్ధి చాతుర్యం. ఈ కాలంలో మేధను జీనియస్ అని అంటారేమో? జీనీయస్ ఎప్పుడూ మంచిగా వుంటుందనడానికి వీలులేదు. అది విపరీతమార్గాలలోనూ పోవచ్చు. కాని మేధ విషయం అట్లాకాదు తైత్తరీయంలో సంపదను కోరుకొనే దానికి ముందు దానిని సద్వినియోగంచేసే బుద్ధినికూడ ఇవ్వ మని- మేధాదానం చేయమని- ప్రధమం ప్రార్థించాలని చెప్పబడింది.
అట్టి మేధా ప్రదానం చేసి మూకకవిని అనుగ్రహించినది కామాక్షియే. ఒక మూగ కామాక్షి ఆలయంలో కూర్చున్నాడు. పుట్టుకనుండి మూగ. అతని ప్రక్కనే మరొక వ్యక్తి మహత్తరమైన తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు అనుగ్రహించిన రమణీయమైన కవిత్వంతో ఆమెనే స్తుతించి ఆమెను మెప్పించాలి. తాను ప్రేయస్సూ, శ్రేయస్సూ రెండూ పొందాలి, ఇదీ అతని ధ్యేయం. దానికై అతడు తపస్సు చేస్తున్నాడు. కాని అతనికి ఆమె అనుగ్రహం పొంద దగిన పక్వస్థితి ఇంకా ఏర్పడలేదు. దానికి ఇంకా కాల మున్నది. కాని అతడు చేస్తున్నది. మాత్రంఉగ్రమైన తపస్సు. అందుచేత అతనికి దర్శనం ఇవ్వవలసినదే. వరప్రదాన కాలం మాత్రం ఇంకా రాలేదు. సాధారణులకు ఇది సంకటం కలిగించే సందిగ్ధావస్థ. కాని కామాక్షికి కాదు !
ధ్యానంలో కూరుచున్నవాడు వాడు కళ్లు తెరవగానే అమ్మవారు కనబడి నోరు తెరవ మని అతనిని ఆజ్ఞాపించింది. సకల శబ్దప్రపంచమునకు మూలమైన శ్రీకరమైనఅమ్మవారి తాంబూలోచ్ఛిష్ఠము ఎవనికైనా లభించిందంటే, సంగీత సాహిత్య సరస విద్యలు ఒక్క త్రుటిలో లభిస్తవి. కాని అందరికీ ఆ ప్రసాదం అంత సులభంగా దొరుకుతుందా? అందుచేత అతనికి బుద్ధి మందగించింది. తపస్వియైన తాను ఒక స్త్రీ ఉచ్ఛిష్ఠమును గ్రహించుటా? ఏమి వెఱ్ఱితనము? తన శౌచమునకు భంగముకదా? ఈ ఆలోచన అతనిలో ఒకవిధమైన జుగుప్సను రేకెత్తించింది. నీ వెవరవో ఒక స్త్రీ. నా తపస్సు భంగం చేయాలనీ, నా శౌచం మంట గలపాలనీ నీవు తీర్మానించి నట్టున్నది. నాముందు నుంచి వెళ్ళిపో!' అని అన్నాడు.
అతని ప్రక్కనే ఉన్న మూగవాడు అంతా వినినాడు. తన రొట్టె విరిగి నేతిలో పడిందనుకొన్నాడు. వానికి తపో నిరతీ శాస్త్రజ్ఞానమూ ఇలాంటివి ఏవీ లేవు. సాధారణవ్యక్తి. తపస్వి ఉచ్ఛిష్ఠ నిరాకరణ చేయగానే ఇతడు తన నోటిని విశాలంగా తెఱచినాడు. అవ్యాజ కరుణామూర్తియైన అమ్మవారు అతని నోట తాంబూల రపమును ఉమిసినది. అంతే ఆ క్షణంలో ఆ మూగ మహాకవిగా మారిపోయినాడు. అమ్మవారి ప్రభావాన్ని ఆర్యాశతకంగావిరచించాడు. కండ్లుపాదార విందములపై వ్రాలగా వెంటనే పాదారవింద శతకమును పాడినాడు. కామాక్షి కృపావిలాసాన్ని స్తుతి శతకంగా చెప్పినాడు. ఆమె కటాక్షమును చూచి కటాక్షశతకం చేశాడు. ఈ మూగవానిఅనర్గళ కవితాసౌందర్యలహరిలో ఆనందంగా తేలుతున్న అమ్మవారి చిరునవ్వుపై మందస్మిత శతకం గడగడా చదివినాడు. అట్లా ఆశువుగా చదివిన సుందర కావ్యమే మూకపంచశతి !
మూకపంచశతిలో లేనిది లేదు. కావ్యరసము, భక్తి మరందము, జ్ఞాన ప్రసూన సౌరభములు, మంత్రము, తంత్రము ఒక్కటేమి! ఏది కావాలిస్తే అది దానిలో ఉన్నది. కర్పూర తాంబూల ఖండోత్కరియొక్క ఉచ్ఛిష్ఠంలో పుట్టిన ఉచ్ఛిష్ఠ కావ్యం మూకపంచశతి, అద్భుతముగా వుండటమే కాక అనుగ్రహ ప్రదంగానూ ఉన్నది. దానిని పారాయణ చేస్తే ఆ పుణ్యకార్యం మనలను కూడ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులుగా చేస్తుందనుటలో సందేహ మేమీ లేదు.
మానవమాత్రులమైన మనం ఏ కార్యాన్ని గానీ వదలక చేస్తుంటే, అలసట ఆలస్యం మొదలైనవి ఏర్పడుతవి. త్రిభువన జనని ఐన అమ్మవారు విసుగూ విరామమూ లేకుండా చేసే ఒక కార్యాన్ని గూర్చి మూకకవి ఇలా వ్రాస్తాడు.
ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ
శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశన్తీ |
తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణ వృష్టి ప్రదాత్రీ
చండీదేవీ కలయతి రతిం చంద్రచూడాల చూలీ ||
ఈ శ్లోకంలో ప్రాతిభశ్రీ అన్న పదప్రయోగం చేయబడింది. అంటే విసుగూ విరామమూ లేక ఆమె పాదములను నమ్ముకొన్న వారి స్వాభావికములైన పాపములను తొలగించి, (ఖండీకృత్య ప్రకృతికుటిలం) పాపక్షయంచేసి ప్రతిభను, మేధను ప్రసాదించి, కనకధారను తుండీర నామక పుణ్యమండలంలో చండీదేవి కురిపిస్తుందట !
'తుండీరాఖ్యే మహతి విషయే'- తొండ మండలమునకే తుండీరదేశ మనిపేరు. దీనికి ఉత్తర భాగంలో శ్రీకాళహస్తి క్షేత్ర మున్నది. అక్కడ ప్రవహిస్తున్న నది పేరు స్వర్ణముఖి. తమిళంలో దీనిని పొన్‌ముగలి అని అంటారు. పొన్ను అంటే బంగారు పేరులోనే బంగార, మున్నది. దక్షిణదిశలో పెన్నారు. తమిళంలో 'ఆరు అంటే ఏరు. పెన్నె ృ ఆరు ్స పెన్నారు. పినాకిని అన్నపదం పెన్నగా మారింది. పరమేశ్వరుడు తన పినాకంతో భూమిపై ఒక రేఖను గీయగానే పెన్నా రేర్పడింది అని పురాణం. తూర్పుభాగంలో బంగాళాఖాతం. పడమర ఉత్తర ఆర్కాటుజిల్లాలోఉన్న విరించిపురం (అప్పయ దీక్షితులవారి జన్మస్థలము)- ఈ నాలుగూ తొండమండలపు టెల్లలు. సంస్కృతంలో దీనిపేరు తుండీరదేశం. మూకకవి తుండీరాఖ్యే మహతివిషయే- అని ఈ ప్రదేశాన్నే వర్ణించాడు.
స్వర్ణవృష్టి కురిసిన తుండీరదేశంలో ఇప్పుడు కరవు. వరాలు సరిగ్గా పడకపోతే కరవు. వరాలు ఎందుకు పడటం లేదు. అదే సూర్యుడు, అదే భూమి అదేసముద్రం ఒకప్పుడు వరం పడటమేమి? మరొకపుడు పడకపోవట మేమి? అంటే జనుల జీవితములు క్రమబద్ధంగా ఉండక పోవటం చేతనే. అన్యాయం ఎక్కువ కావటం వలననే సకాలంలో వరాలు పడటం లేదని చెప్పవలసి వస్తుంది. మనం చేసేపాపాలు ఇతరులకు హింసాకారణంగా వున్నవని ఈ క్షామమును చూస్తేనే తెలుస్తుంది. దేశమును క్షామం ఆవరించిందంటే దేశంలోని సత్పుషులతో సహా జనులందరూ బాధపడవలసి వస్తున్నది. ఒకడు చేసిన పాపం ఊరినంతా బాధిస్తున్నది. తొండమండల వాసుల అవస్థచూచి అమ్మవారికి జాలివేసింది. తా నిచ్చిన దండన చాలనిపించింది. ప్రజలకు ప్రస్తుతం కావలసినది ఆహారం. మేధ కాదు. కాని ధాన్యసమృద్ధి వెంటనే ఏలా లభిస్తుంది? డబ్బుంటే ఇరుగు పొరుగు దేశాలకువెళ్ళి ధాన్యం కొనుక్కోవచ్చును. అందుచేత ఆమె తొండమండలంలో కనకవరం కురిసేటట్లు అనుగ్రహించింది.
ఈ విధంగా కనకవరమును కురిపించిన కామాక్షిని తమ జీవిత చరమదశలో భగవత్పాదుల వారు వచ్చి ఆశ్రయించారంటే అదిభవ్యంగానే వున్నది. ఏమంటే ఆచార్యులవారి వదనారవింద గళిత మధుధార కదాకనక ధారాస్తోత్రము! వటవృక్ష చ్ఛాయలో భద్రాసనాసీనుడైన దక్షిణామూర్తి మౌనమునకు స్వస్తి చెప్పి వాగ్వరం కురిపించడానికి ఆచార్యులుగా అవతరించారు. రామేశ్వరం మొదలు బదరీనాథ్ వరకూ, ఆ సేతు శీతనగ పర్యంతం, యాత్రలుచేసి అద్వైతస్థాపన గావించారు. కట్టకడపట కాంచీపురంలోని అంబిక చరణాలను ఆశ్రయించారు. అమ్మవారి ఉగ్రకళను శమింపజేసి శ్రీ చక్ర ప్రతిష్ఠనుచేసి శాంతమూర్తిగా చేశారు. ఆమె పీఠంలోవుంటూ షణ్మత స్థాపన చేశారు. ఇవన్నీ వారు కడపటి కాలంలో చేసిన కార్యాలు. తర్వాత సర్వజ్ఞ పీఠారోహణ గావించారు. వారు కనకధారాస్తోత్రం ప్రప్రథమం చదవటమూ ఈ తుండీర మండలంలో కనకవృష్టికి ఒక సంబంధమున్నది. కనకవృష్టి కురిపించిన కామాక్షి. కనకవృష్టిని కురిపించేటట్లు చేసిన భగవత్పాదులు- వీరిరువురి విశేష సాన్నిధ్యము కాంచీపురములో ఉన్నదనుటకే ఈ ఉదంతాన్ని చెప్పాను.
ఒక బీద గృహస్థురా లింటిలో కనకధారను ఆచార్యుల వారు కురిపించగా తొండమండలములో కనకవృష్టిని కామాక్షి కురిపించిన దనీ ఈ ఇరువురూ నెలకొనియున్న ఈ పుణ్య క్షేత్రంలో మీరు నాకు ఈ కనకాభిషేకం తలపెట్టారు.
దీనికి నే నెందుకు ఒప్పుకొన్నాను?
ఒక వృద్ధ బ్రాహ్మణుడు- ఆయనకు ఎనభై ఏళ్ళులంటాయి. ''మీకు కనకాభిషేకం చేసి ఆ దివ్యదృశ్యాన్ని చూడాలని చాలా ఆశపడుతున్నా- మీరు తప్పక ఒప్పుకోవాలి'' అని తొందర పెట్టుతూ వచ్చారు. నేను ఏమీ బదులు చెప్పక ఊరకున్నాను.'' నాకూ వయస్సు ఔతున్నది. ఏదో కళ్ళు మూసే ముందు ఈ కనకాభిషేకాన్ని చూస్తేచాలు'' అని ఆయన వచ్చినప్పుడల్లా అడుగుతూ వుండేవారు. ఒక వ్యక్తికి, భక్తీ, అభిమానమూ ఉండే ఈలాంటి ఆలోచనలన్నీ కలుగు తుంటవి. అందులకే ఆయన అడగటం వదలలేదు. నేనూ నా బిగింపు వదలలేదు. అటు పిదప ఆయనకు చూపు క్షీణిస్తూ వచ్చి. పూర్తిగా కండ్లు పోయినవి. ఆయనకు దృష్టిపోవటం కూడా ఒక విధంగా మంచిదే అని అనుకొన్నాను. 'కనకాభిషేకం కన్నులారా చూడాలని అన్నారు కదా? ఇప్పుడేమో మీకు చూపులేదు. ఇంక మీరు మీ ఆశను వదులుకోవచ్చు' అని అన్నాను. దీనితో విషయం పరిష్కారమైనట్లు. కాని ఆయన వదలే మనిషికాదు. 'కంటికి నేను చికిత్స చేసుకొంటాను. కనకాభిషేకం జరగాల్సిందే' అంటూ చికిత్సకు బయలుదేరారు. ఆయన సంకల్పబలం ఎలాంటిదో ఆయనకు కళ్లు బాగై చూపు మళ్ళా సిద్ధించింది. 'నాకు కళ్ళు మళ్ళా వచ్చినవి కాబట్టి కనకాభిషే మెప్పుడు?' అని ఆయన మళ్ళా నాదగ్గరకు వచ్చారు. ఆయన కోరికను నిరాకరించే శక్తి నాకు లేకపోయింది. వేరుగతి లేక సరే అని అన్నాను.
ఈ కనకాభిషేకం చేసుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు. కాలపరిస్థితులను గమనించినా ఇది యుక్తంగా కనపడలేదు. కాని ఈ వృద్ధ బ్రాహ్మణుని పట్టుదల, ఆసక్తీ, అభిమానమూ. మరి కొందఱి కోరిక మేరకు దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కాదనడానికి వీలు లేక పోయింది.
ఇట్లు కనకాభిషేకం చేయడానికి మీరందఱు పూనుకొన్నారు. స్వర్ణోత్సవం వేరే చేయాలని సంకల్పించారు. నన్ను మీరు ఇట్లు గౌరవిస్తూ వుంటే, నేనూ నా గౌరవాన్నీ భక్తినీ, ఇద్దరికి తెలుపుకోవాలని కలవై గ్రామానికి వెళ్ళాను. కలవైతో నా యొక్క గురువు, పరమ గురువుల అధిష్ఠానము లున్నవి. గురువుయొక్క గురువును పరమగురు వని అంటారు. పరమగురువు యొక్క గురువు పరమేష్ఠి గురువు. పరమేష్ఠి యొక్క గురువు పరాపర గురువు. నన్ను గురువుగా భావించి, మీరందఱు నాకు నమస్కారం చేస్తున్నారు. కనుక నేనూ నాయొక్క గురువు, పరమగురువులను నమస్కరించి మిమ్ములనూ వారికి నమస్కారము చేయమనిచెప్పి, వారిని గూర్చి కొంత వివరిస్తారు.
కలవై అనగా తమిళములో 'కలయిక' అని అర్థము. నా గురువు పరమగురువు ఈ చోట సిద్ధి పొందిరి కనుక ఈ పేరు యుక్తంగానే వున్నది. ద్వైతభావము వదలి ఏకత్వ మొందుట కలయిక- కలవై. నది సముద్రములో నామరూపములు వదలి కలసిబోయినట్లు జీవాత్మ పరమాత్మతో కలసి పోవటం కలవై. కలవై అన్న పేరు పొందికగానే వుంది.
వీరికి పూర్వమున్న ఆచార్యులు నాకు పరమేష్ఠి గురువు. ఈయన సిద్ధిపొందినది పుదుక్కోట సమీపాన ఉన్న ఇలయాట్రంగుడి. రామనాథపురం జిల్లాలోనిది. దీని పేరూ పొందికగానే వున్నది. పరమేష్ఠి గురువులు రామేశ్వరం వెళ్ళి తిరిగి వస్తున్నారు. త్రోవలో ఇలయాట్రంగుడి వచ్చి చేరారు. ఆ వూరుచుట్టూ అడవీ, ముళ్ళపొదలూ ఏ కారణం చేతనో వారు ఆ వూరు చేరారు. ఒక బిల్వవృక్షం క్రింద విడిది చేశారు. తన అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని రాత్రి ఒంటిగంట వరకూ సమాధి నిష్ఠలో వుండి అట్లే సిద్ధిపొందారు. వారిని ఆ చోటనే సమాధిచేసి, శివలింగ ప్రతిష్ఠచేసి ఒక కోవెల కట్టినారు. సన్యాసిని సమాధిచేసి, ఆ స్థలంలో తులసి నాటితే దానిని బృందావన మంటారు. శివలింగం ప్రతిష్ఠిస్తే అధిష్ఠానమని అంటారు. కలవై గ్రామములో గురువుకూ, పరమ గురువుకూ బృందావనములున్నవి. ఇలయాట్రం గుడిలో పరమేష్ఠి గురువుకూ అధిష్ఠాన మున్నది. చెట్టినాడులో ఉన్న తొమ్మిది శివాలయములలో ఇలయాట్రంగుడి ప్రధానమైనది.
ఈ చోట వారు సిద్ధిపొందుటం, ఈ వూరి పేరూ పొందికగా వున్నది. 'ఇలయాట్రం గుడి' వారికి ఇళ్లెప్పెరు- గుడి'గా మారినది. తమిళమున ఇళ్ళెప్పెరువదు' అనగా విశ్రమించుట, నిరంతర విశ్రాంతికి వారు ఈ చోటును ఎన్నుకొన్నారు కాబోలు. గురువు పరమగురువు. కలవైలో పరమాత్మతో కలసిపోగా, పరమేష్ఠి గురువు ఇలయాట్రంగుడిలో విరతినొంది శివైక్య మయ్యా రన్నమాట!
పరమేష్ఠి గురువు యొక్క గురువు పరాపర గురువు. వారు విస్తారంగా సంచారమూ, దిగ్విజయ యాత్రలూ చేసిన వారే. వారు తిరవానైక్కావు అనే జంబుకేశ్వరము వెళ్ళారు. ఈ క్షేత్రము తిరుచ్చినాపల్లిలో వున్నది. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. కాంచీనగరంలో భగవత్పాదాచార్యులు శిలారూపంలో శ్రీచక్రమును ప్రతిష్ఠించారు. కాని జంబు కేశ్వరములో శ్రీచక్రముతోపాటు శివచక్రమునుకూడ వారు ప్రతిష్ఠించుట ఒక విశేషము. మరొక విశేష మేమనగా ఈ రెండు చక్రములనూ తాటంక రూపమున నిర్మించి అఖిలాండేశ్వరికి అర్పణ గావించారు. అమ్మవారి ఉగ్రకళను, చక్రముల లోనికి ఆకరించి ఆమెకే వానిని ఆభరణములుగా సమర్పించారు. వీనిని అప్పుడప్పుడూ మరమ్మత్తుచేసి పునః ప్రతిష్ఠ చేయుటకద్దు, అట్లు తాటంక ప్రతిష్ఠ చేసిన వారిలో పరాపర గురువు ఒకరు. వారు అట్టు తాటంక ప్రతిష్ఠచేసి కుంభకోణమునకు వస్తున్నపుడు జరిగిన సంఘటనకు, నేను ధరించిన ఈ శాలువకూ ఒక సంబంధ మున్నది.
వారు తాటంక ప్రతిష్ఠచేసినపుడు తంజావూరు, మహారాష్ట్ర రాజుల పరిపాలనలో వుండేది. శివాజీ స్థాపించిన సామ్రాజ్యం చీలిపోగా తంజావూరు స్వతంత్ర రాష్ట్రమైంది. ఆ సమయంలో తంజావూరును పాలిస్తున్న ప్రభువు పేరున్నూ శివాజియే. ఆయన ఆచార్యుల వారిని ఆహ్వానించి ఘనతర మైన ఉపచారము చేయాలని సంకల్పించారు. మార్గ మధ్యముననే స్వాములవారి పరివారాన్నీ, బండ్లను తంజావూరికి తరలించుకొని రావలసిన దని సిబ్బందికి పురమాయించారు. ఆచార్యులను పరమాదరంతో భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి కనకాభిషేకం చేసి, నేను ప్రస్తుతం ధరించివున్న ఈ శాలువను ఆయనకు సమర్పించారు. మీరు కనకాభిషేకం తల పెట్టగానే ఈ శాలువ జ్ఞప్తికి వచ్చింది.
దీనిని మఠంలో ఒక పెట్టిలో చాల రోజులుగ భద్రపఱచి కాపాడుతూ వున్నారు. ఈ సందర్భంలో దీనిని నేను ధరించుటే నిజమైన కనకాభిషేకం. నా పరాపర గురువు యొక్క అనుగ్రహ వస్త్రాన్ని ఆచ్ఛాదించు కోవడం కంటే వేరే కనకాభిషేక మేమున్నది? చాలా పురాతనమైన వలువ, కొంచెం కదలితేచాలు, శిధిలమై రాలిపోతున్నది. ఇందులోని జరిగ మంచి బంగారు జరిగ, దాని ధూళి, స్వర్ణరజస్సు- నేను కదిలితేచాలు. గాలిలోకలసి మీపైన కూడా పడుతున్నది. అంటే నేను మీకున్నూ కనకాభిషేకం చేస్తున్నానన్నమాట ! ఈ ఒక్క శాలువ ఇంతమందికి కనకాభిషేకం చేస్తున్నది!! ఈ గురుప్రసాదమును మన మందరమూ భావిస్తున్నాము. కనుక ఆ మనోభావమే కనకవృష్ఠిగ కురుస్తున్నది ! ! !
ఈ కాలంలో ధరలన్నీ పెరిగిపోయినవి. బంగారుమాట చెప్పనక్కరలేదు. ఇంత వెలవేసి కనకాభిషేకం చేయవలసిన పనేలేదు. మీ అందఱి ప్రేమామృత సీకరములే నాకు కనక ధారలు. ఈ ఉత్సవ కార్య నిర్వాహకులు చేసిన కనకాభి షేకము ఇంతకుముందు శివాజీ మహారాజుచేత కనకాభిషేకం చేసుకొన్న పరాపర గురువుల కృప- వారికి ముందు కనక ధారను కురిపించిన భగవత్పాదుల కరుణ, అంతకు మునుపు ఈ తుండీర మండలంలో స్వర్ణవృష్ఠి కురిపించిన జగదంబ కామాక్షీ కరుణాకటాక్ష సాంద్రవృష్ఠి- అన్నీ కలపి నాకు పెద్ద కనకాభిషేకమై పోయింది.
నేను జగన్మాతను ఆది శంకరులను, పూర్వాచార్యులను స్మరించేటట్లు ఈ కనకాభిషేకం చేసినది. తుండీర దేశంలోని జీవరాసులన్నీ క్షేమంగా ఉండాలని అమ్మవారు స్వర్ణ వృష్ఠిని కురిపించింది. ఒక పేద గృహస్థురాలి దారిద్ర్యం తొలగాలని ఆచార్యులవారు కనకధారను కురిపించారు. ఈ స్మరణ మన హృదయ సీమలలో జీవకారుణ్యం ఉత్పాదింప చేయాలి. లోకమంతా క్షేమంగా వుండాలంటే వ్యాధులు' దుర్భిక్షములూ ఉండరాదు. అది పాపరహిత జీవనం వలననే సాధ్యమౌతుంది. స్వాభావికములైన పాపములన్నీ పోగొట్టి అందరికి మేధాశ్రీలను ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అందరూ శాంతిగా క్షేమంగా ఉండాలని గురు మూర్తులను కోరుకుంటున్నాను.
|